దర్శకునిగా దాసరి నారాయణరావు తొలి చిత్రం 'తాత మనవడు'లో ఎస్వీ రంగారావుపై చిత్రీకరించిన "అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం" పాట ఎంత పెద్ద హిట్టయ్యిందో చెప్పలేం. ఆ పాటను పాడింది రామకృష్ణ. ఆయన చేత ఆ పాట పాడించాలని సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు నిర్ణయించుకున్నారు. రిహార్సల్స్ చేయిస్తున్నప్పుడు స్టూడియోకు గంధర్వ గాయకుడు ఘంటసాల వచ్చారు. ఆయనను చూసి రామకృష్ణ టెన్షన్ పడ్డారు. ఘంటసాల వచ్చి రామకృష్ణ పక్కన కూర్చున్నారు. దాంతో గతుక్కుమన్నారాయన.
"పాట ఎవరు పాడుతున్నారు?" అని రమేశ్ నాయుడును అడిగారు ఘంటసాల. "ఈ కొత్తకుర్రాడు రామకృష్ణ పాడుతున్నాడు." అని ఆయన జవాబిచ్చారు. "సరే నాన్నా.. బాగా పాడు. రంగారావుకు మంచి పాటవుతుంది. రికార్డింగ్‌కు నేనొస్తాను." అని చెప్పారు ఘంటసాల. ఆయన దగ్గరుంటే ఎలా పాడగలనని మళ్లీ టెన్షన్ పట్టుకుంది రామకృష్ణకు.
జెమినీ స్టూడియోలో రికార్డింగ్ ప్రారంభమైంది. రెండు టేకులు అయ్యాక ఘంటసాల వచ్చారు. రామకృష్ణ పాడుతుంటే చిన్న చిన్న కరెక్షన్లు చెప్పారు. పాట అయ్యాక, "బాగా పాడావ్. నా పట్టులన్నీ పట్టేశావ్" అని ఘంటసాల మెచ్చుకున్నారు. అదే పాటలో "అనుబంధం ఆత్మీయత" అనే డైలాగ్‌ను ఎస్వీ రంగారావుతో చెప్పించాలని దాసరి అనుకున్నారు. "పాట మొత్తం బాగా పాడినవాడు ఆ రెండు ముక్కలు చెప్పలేడా? నేను పాడిస్తా" అని చెప్పి దగ్గరుండి రామకృష్ణతో ఆ డైలాగ్స్ సహా పాట మొత్తం పూర్తి చేయించారు ఘంటసాల. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో వేదికపై పంచుకున్నారు రామకృష్ణ. ఆ పాట రామకృష్ణ కెరీర్‌లో మకుటాయమానమైన పాటగా నిలిచింది.